ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే తిరుపతిలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రిజర్వేషన్ జనరల్ లేదా జనరల్ మహిళకు వస్తే. తిరుపతి మేయర్ రేసులో బలిజ సామాజిక వర్గం నుంచి పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ లెక్కల్లో టీడీపీకి చెందిన ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్ పేరు వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ. బలిజ సామాజిక వర్గంలోనూ పరిచయాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారుతుందని అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో ఉన్న పరిచయాలు, సినీ హీరో నారా రోహిత్‌తో సత్సంబంధాలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం కూడా ప్రణీత్‌కు కలసొచ్చే అంశాలుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ మేయర్ స్థానం మహిళలకు రిజర్వ్ అయితే.. ప్రణీత్ తల్లి పెనుమాదుల సులోచనమ్మ పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
ఇదే సామాజిక వర్గం నుంచి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి పేరు కూడా వినిపిస్తోంది. సుగుణమ్మ ఇప్పటికే కీర్తిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తీసుకెళ్తుండటంతో.. భవిష్యత్ రాజకీయాలకు ఆమెను సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే.. తిరుపతి ఎమ్మెల్యేగా ఇప్పటికే బలిజ సామాజిక వర్గానికే చెందిన జనసేన నేత ఆరణి శ్రీనివాసులు ఉండటంతో.. మేయర్ పదవి విషయంలో అధిష్ఠానం సామాజిక సమతుల్యత పాటిస్తుందా. లేక మరోసారి అదే వర్గానికే అవకాశం ఇస్తుందా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక మేయర్ స్థానాన్ని బీసీ కేటగిరీకి కేటాయిస్తే మాత్రం.. తిరుపతి రాజకీయాల్లో లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ రేసులో యాదవ సామాజిక వర్గానికి చెందిన అన్నా అనిత పేరు అత్యంత బలంగా, ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అన్నా అనిత.. పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొంటూ, నియోజకవర్గంలో గ్రౌండ్ లెవల్‌లో బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆమె నాయకుడు అన్నా రామచంద్రయాదవ్‌తో కలిసి అధినేత నారా చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఆమె అభ్యర్థిత్వానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పైగా తిరుపతి మేయర్ పదవిపై యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న అధిష్ఠానం.. మహిళా ప్రాతినిధ్యం, పార్టీ పట్ల ఉన్న నిబద్ధత దృష్ట్యా అన్నా అనిత వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోందనే చర్చ కూటమి వర్గాల్లో గట్టిగా నడుస్తోంది.
అదే బీసీ సామాజిక వర్గం నుంచి దంపూరి భాస్కర్ యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన కుటుంబానికి అనుబంధం ఉండటం, గతంలో తిరుపతి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్లు. ఒకవేళ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే, తన భార్య దంపూరి లావణ్యను కూడా బరిలోకి దించేందుకు భాస్కర్ యాదవ్ సిద్ధంగా ఉన్నారనే టాక్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాల ప్రకారం అన్నా అనిత పేరే రేసులో స్పష్టమైన ముందంజలో ఉంది.
ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఉన్నారు. విస్తృత పరిచయాలు, నియోజకవర్గంలో కేడర్‌తో అనుబంధం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మబ్బు దేవనారాయణరెడ్డి పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామ్‌రెడ్డి కుమారుడిగా ఆయనకున్న పరిచయాలు కలసొస్తాయని అనుచరులు భావిస్తున్నప్పటికీ.. సామాజిక సమీకరణాల దృష్ట్యా రెడ్డి సామాజిక వర్గానికి అధిష్ఠానం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందన్నది చూడాలి. మొత్తం మీద చూస్తే మాత్రం, స్థానిక సమీకరణాలు-బీసీ ప్రాధాన్యత దృష్ట్యా అన్నా అనిత అభ్యర్థిత్వమే మేయర్ రేసులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
Author: GDR NEWS WEB
-

తిరుపతి మేయర్ పీఠం ఎవరిది? బలిజ, యాదవ వర్గాల మధ్య తీవ్ర పోటీ..!
-

డ్రై ఫ్రూట్స్ ఆర్డర్. రీఫండ్ పేరుతో QR కోడ్ పంపి రూ.2.60 లక్షలు స్వాహా..!
సనత్‌నగర్‌లోని లోధా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి మీనా అహుజా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రై ఫ్రూట్స్ హోం డెలివరీ ప్రకటనను చూశారు. ప్రకటనను నమ్మి రూ.1,700 విలువైన డ్రై ఫ్రూట్స్‌ను ఆర్డర్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించారు. కొంతసేపటి తర్వాత అదే ఫోన్ నంబర్ నుంచి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. డ్రై ఫ్రూట్స్ పార్సిల్ క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో వస్తుందని, ముందుగా చెల్లించిన రూ.1,700 మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని నమ్మించాడు. అనంతరం ఓ క్యూఆర్ కోడ్‌ను పంపించి దాన్ని స్కాన్ చేయాలని సూచించాడు. మహిళ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.21,700 డెబిట్ అయ్యాయి
తన ఖాతా నుంచి నగదు డెబిట్ కావడంతో మహిళ ఆ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొరపాటున నగదు డెబిట్ అయిందని, మొత్తం తిరిగి జమ చేస్తామని నిందితుడు నమ్మించాడు. మరో క్యూఆర్ కోడ్‌ను పంపి స్కాన్ చేయించాడు. ఈసారి రూ.43,000 ఆమె ఖాతా నుంచి మాయమయ్యాయి. ఇలా రీఫండ్ పేరుతో పలుమార్లు క్యూఆర్ కోడ్‌లు పంపించి.. మహిళను నమ్మిస్తూ మొత్తం రూ.2,60,100 స్వాహా చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో చోరీలు, మోసాలకు పాల్పడుతున్న మహిళా ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కూకట్‌పల్లి పరిధిలో మహిళల నుంచి నగదు, నగలు దోచుకున్న ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అలాగే ధూల్‌పేట్, బేగంబజార్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాకు చెందిన ఇద్దరు మహిళలను మంగళ్‌హాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పసిపిల్లలను గుర్తించి ఎత్తుకెళ్లే ముఠా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
-

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష: పటిష్టమైన చర్యలకు ఆదేశం..!
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో తిరుమలలో ముందస్తు ఏర్పాట్లను టీటీడీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు టీటీడీ జేఈవోలు, సీవీఎస్వో, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
-
ఘనంగా ప్రారంభమైన మహానాడు – 2026 | ‘స్త్రీశక్తి’ థీమ్‌తో పసుపు పండుగ!

తెలుగుదేశం పార్టీ వార్షిక మహోత్సవం ‘మహానాడు – 2026’ శ్రేణుల ఉత్సాహం మధ్య ఘనంగా ప్రారంభమైంది. పార్టీ వ్యవస్థాపకులు, మహానేత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికి ఘన నివాళులర్పిస్తూ ఈ ప్రతిష్టాత్మక సభను ప్రారంభించారు.
ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తుండటం విశేషం. మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు. ఆనాడు మహిళలకు ఆస్తి హక్కులు కల్పించి విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం… నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. -
తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత కలకలం – ఎట్టకేలకు బోనులో బంధించిన అధికారులు.!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ (SVVU) ఆవరణలో గత కొంతకాలంగా భయాందోళనలు రేకెత్తిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. గడిచిన రెండు నెలలుగా విశ్వవిద్యాలయ విద్యార్థులను, సిబ్బందిని రాత్రింబగళ్లు వణికించిన చిరుత. గమనించిన సిబ్బంది అప్రమత్తమై వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది, వర్సిటీ అధికారుల సహకారంతో చాకచక్యంగా వ్యవహరించారు. చిరుత బయటకు రాకుండా గది తలుపులు మూసివేసి, ప్రత్యేక బోనుని ఏర్పాటు చేశారు. పక్కా ప్రణాళికతో ఆ చిరుతను బోనులో బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ చిరుతను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్కుకు తరలించారు.
-
భక్తులకు మరింత విశ్వాసం పెంచేలా విస్తృత ఏర్పాట్లు
సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యం – టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు . వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్ కౌంటర్లను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణలతో కలిసి ఆదివారం సాయంత్రం అడిషనల్ ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో శ్రీవారి దర్శనం, అన్నప్రసాదం, తాగునీరు, భద్రత తదితర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నామని తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆ ప్రాంతాల్లో నాణ్యమైన మౌలిక వసతులు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఎప్పటికప్పుడు సమాచారం అందించే విధానం, వర్షాలకు తడవకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విజిలెన్స్, జిల్లా పోలీసులు, టిటిడిలోని వివిధ విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులు తిరుమలకు వచ్చినప్పటికీ, భక్తుల సంఖ్య, దర్శన సమయం, క్యూలైన్ల పరిస్థితి, ముందురోజు దర్శనాల వివరాలు వంటి అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి సీజన్‌లో భక్తుల రద్దీ భిన్నంగా ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్వహణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టిటిడి అధికారిక సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భక్తులు తిరుమలకు వస్తే, అందరికీ సమర్థవంతంగా శ్రీవారి దర్శనం కల్పించడం మరింత సులభమవుతుందన్నారు. భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు – జిల్లా ఎస్పీతిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులను తప్పుదోవ పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు హెచ్చరించారు.పోలీసు, ట్రాఫిక్, టిటిడి విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నాయని, భక్తులు కూడా సహకరించాలని కోరారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో కొందరు ఆటో డ్రైవర్లపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అవసరమైతే ఆటోలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. భక్తులు సురక్షిత వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొందరి ప్రవర్తన వల్ల తిరుపతికి చెడ్డపేరు రాకుండా చూడాలని సూచించారు.
తప్పుడు సోషల్ మీడియా వార్తలను నమ్మవద్దు – టిటిడి సివిఎస్వో
భక్తులను మోసం చేసే తప్పుడు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని టిటిడి సివిఎస్వో కె.వి. మురళీకృష్ణ సూచించారు. టిటిడి అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, మోసపూరిత చర్యలపై టిటిడి విజిలెన్స్‌కు సమాచారం అందించాలని కోరారు.భక్తుల సౌకర్యార్థం పటిష్టమైన క్యూలైన్లు, భద్రతా చర్యలు అమలు చేస్తున్నామని, జిల్లా పోలీసులు మరియు టిటిడి విజిలెన్స్ విభాగాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు. అనంతరం శ్రీనివాసం, విష్ణు నివాసం వద్ద ఉన్న సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను పరిశీలించారు.
-
హంసవాహనంపై సరస్వతి స్వరూపుడై భక్తులను కటాక్షించిన గోవిందరాజస్వామి..!

హంసవాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ గోవిందరాజస్వామి. వాహనసేవలో పాల్గొన్న జీయర్‌స్వాములు, ఆలయ అధికారులు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారు సరస్వతి దేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అభయప్రదాతగా వెలుగొందారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది.
వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా… చెక్కభజనలు, కోలాటాలు, గోవింద నామస్మరణలతో తిరుపతి మాడవీధులు మారుమోగాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవను తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి దివ్యానుభూతిని పొందారు.
హంసవాహనం – జ్ఞానానికి ప్రతీక
బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా పురాణాలు పేర్కొంటాయి. పాలను నీటిని వేరుచేసే హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సంకేతం. అందుకే పరమాత్మతో ఏకత్వం పొందిన మహనీయులను “పరమహంసులు”గా ఉపనిషత్తులు అభివర్ణించాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే శ్రీహరి హంసవాహనాన్ని అధిరోహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి.

