శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో తిరుమలలో ముందస్తు ఏర్పాట్లను టీటీడీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు టీటీడీ జేఈవోలు, సీవీఎస్వో, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల ముగిసిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను టీటీడీ, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాయని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. అదే సమన్వయ స్ఫూర్తిని రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈసారి పెరటాసి మాసం, వరుస సెలవులు రావడంతో గతంతో పోలిస్తే సుమారు 25 నుండి 30 శాతం వరకు భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పెరిగే రద్దీకి అనుగుణంగా అన్ని విభాగాలు ముందస్తుగా సిద్ధం కావాలని ఆదేశించారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ లాజిస్టిక్స్, అన్నప్రసాదం, వైద్య ఆరోగ్య సర్వీసులు, పారిశుధ్యం, రవాణా, విద్యుత్ మరియు పుష్పాలంకరణల విభాగాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులందరూ తిరుమలకు విచ్చేసి ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వాహన సేవలను తిలకించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని టీటీడీ ఈవో కోరారు.


Leave a Reply