సనత్‌నగర్‌లోని లోధా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న విశ్రాంత ఉద్యోగి మీనా అహుజా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో డ్రై ఫ్రూట్స్ హోం డెలివరీ ప్రకటనను చూశారు. ప్రకటనను నమ్మి రూ.1,700 విలువైన డ్రై ఫ్రూట్స్‌ను ఆర్డర్ చేసి ఆన్‌లైన్‌లో చెల్లించారు. కొంతసేపటి తర్వాత అదే ఫోన్ నంబర్ నుంచి ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. డ్రై ఫ్రూట్స్ పార్సిల్ క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో వస్తుందని, ముందుగా చెల్లించిన రూ.1,700 మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తామని నమ్మించాడు. అనంతరం ఓ క్యూఆర్ కోడ్‌ను పంపించి దాన్ని స్కాన్ చేయాలని సూచించాడు. మహిళ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.21,700 డెబిట్ అయ్యాయి
తన ఖాతా నుంచి నగదు డెబిట్ కావడంతో మహిళ ఆ వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొరపాటున నగదు డెబిట్ అయిందని, మొత్తం తిరిగి జమ చేస్తామని నిందితుడు నమ్మించాడు. మరో క్యూఆర్ కోడ్‌ను పంపి స్కాన్ చేయించాడు. ఈసారి రూ.43,000 ఆమె ఖాతా నుంచి మాయమయ్యాయి. ఇలా రీఫండ్ పేరుతో పలుమార్లు క్యూఆర్ కోడ్‌లు పంపించి.. మహిళను నమ్మిస్తూ మొత్తం రూ.2,60,100 స్వాహా చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో చోరీలు, మోసాలకు పాల్పడుతున్న మహిళా ముఠాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కూకట్‌పల్లి పరిధిలో మహిళల నుంచి నగదు, నగలు దోచుకున్న ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అలాగే ధూల్‌పేట్, బేగంబజార్, సరూర్‌నగర్ ప్రాంతాల్లో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న మరో ముఠాకు చెందిన ఇద్దరు మహిళలను మంగళ్‌హాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పసిపిల్లలను గుర్తించి ఎత్తుకెళ్లే ముఠా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. నగరంలో ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Leave a Reply