తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో **“ఉత్కర్ష మహోత్సవం–2026”**కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండురోజుల పాటు ఈ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ మహోత్సవాన్ని ఆగస్టు 19న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు. దేశంలోని మూడు ప్రముఖ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలో సంస్కృత భాష, భారతీయ జ్ఞానపరంపర, ఆధునిక విజ్ఞానంతో సంస్కృతం అనుసంధానంపై పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా జరగనున్న ఉత్కర్ష మహోత్సవంలో 75 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. సంస్కృత భాషకు సంబంధించిన రెండు ప్రత్యేక యాప్‌లను కూడా విడుదల చేయనున్నారు.
గురుకుల విద్యార్థి ఎం. వరదరాజన్‌కు సన్మానం, ఆయన గురువుకు గురుదక్షిణ సమర్పణతో పాటు, పలువురు ప్రముఖ విద్వాంసులకు “ప్రాచ్యవిద్యాభూషణ” బిరుదులతో సత్కారం జరగనుంది.
భారతీయ జ్ఞానపరంపర, ఆధునిక సైన్స్, సాంకేతిక రంగాల్లో సంస్కృతం ప్రాధాన్యత, అంతర్జాతీయ స్థాయిలో సంస్కృత భాషా వైభవంపై ప్రత్యేక చర్చాగోష్టులు నిర్వహించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శోభారాజ్ అన్నమాచార్య సంకీర్తనలు, ఎం.ఏ. ఆదర్శ్ భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
సంస్కృత భాషాభివృద్ధి, పరిశోధన, భారతీయ జ్ఞానపరంపరను మరింత విస్తృతంగా ప్రపంచానికి పరిచయం చేయడమే ఉత్కర్ష మహోత్సవం ప్రధాన లక్ష్యమని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు

Leave a comment