ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే తిరుపతిలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రిజర్వేషన్ జనరల్ లేదా జనరల్ మహిళకు వస్తే. తిరుపతి మేయర్ రేసులో బలిజ సామాజిక వర్గం నుంచి పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ లెక్కల్లో టీడీపీకి చెందిన ఎడిఫై విద్యాసంస్థల అధినేత ప్రణీత్ పేరు వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ. బలిజ సామాజిక వర్గంలోనూ పరిచయాలు ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారుతుందని అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో ఉన్న పరిచయాలు, సినీ హీరో నారా రోహిత్‌తో సత్సంబంధాలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఉన్న సాన్నిహిత్యం కూడా ప్రణీత్‌కు కలసొచ్చే అంశాలుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ మేయర్ స్థానం మహిళలకు రిజర్వ్ అయితే.. ప్రణీత్ తల్లి పెనుమాదుల సులోచనమ్మ పేరు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
ఇదే సామాజిక వర్గం నుంచి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి పేరు కూడా వినిపిస్తోంది. సుగుణమ్మ ఇప్పటికే కీర్తిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తీసుకెళ్తుండటంతో.. భవిష్యత్ రాజకీయాలకు ఆమెను సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అయితే.. తిరుపతి ఎమ్మెల్యేగా ఇప్పటికే బలిజ సామాజిక వర్గానికే చెందిన జనసేన నేత ఆరణి శ్రీనివాసులు ఉండటంతో.. మేయర్ పదవి విషయంలో అధిష్ఠానం సామాజిక సమతుల్యత పాటిస్తుందా. లేక మరోసారి అదే వర్గానికే అవకాశం ఇస్తుందా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక మేయర్ స్థానాన్ని బీసీ కేటగిరీకి కేటాయిస్తే మాత్రం.. తిరుపతి రాజకీయాల్లో లెక్కలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ రేసులో యాదవ సామాజిక వర్గానికి చెందిన అన్నా అనిత పేరు అత్యంత బలంగా, ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అన్నా అనిత.. పార్టీ కార్యక్రమాల్లో అత్యంత చురుగ్గా పాల్గొంటూ, నియోజకవర్గంలో గ్రౌండ్ లెవల్‌లో బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆమె నాయకుడు అన్నా రామచంద్రయాదవ్‌తో కలిసి అధినేత నారా చంద్రబాబు నాయుడితో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఆమె అభ్యర్థిత్వానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. పైగా తిరుపతి మేయర్ పదవిపై యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న అధిష్ఠానం.. మహిళా ప్రాతినిధ్యం, పార్టీ పట్ల ఉన్న నిబద్ధత దృష్ట్యా అన్నా అనిత వైపే ఎక్కువగా మొగ్గు చూపుతోందనే చర్చ కూటమి వర్గాల్లో గట్టిగా నడుస్తోంది.
అదే బీసీ సామాజిక వర్గం నుంచి దంపూరి భాస్కర్ యాదవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన కుటుంబానికి అనుబంధం ఉండటం, గతంలో తిరుపతి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్లు. ఒకవేళ మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయితే, తన భార్య దంపూరి లావణ్యను కూడా బరిలోకి దించేందుకు భాస్కర్ యాదవ్ సిద్ధంగా ఉన్నారనే టాక్ ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాల ప్రకారం అన్నా అనిత పేరే రేసులో స్పష్టమైన ముందంజలో ఉంది.
ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ఉన్నారు. విస్తృత పరిచయాలు, నియోజకవర్గంలో కేడర్‌తో అనుబంధం, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న మబ్బు దేవనారాయణరెడ్డి పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే మబ్బు రామ్‌రెడ్డి కుమారుడిగా ఆయనకున్న పరిచయాలు కలసొస్తాయని అనుచరులు భావిస్తున్నప్పటికీ.. సామాజిక సమీకరణాల దృష్ట్యా రెడ్డి సామాజిక వర్గానికి అధిష్ఠానం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందన్నది చూడాలి. మొత్తం మీద చూస్తే మాత్రం, స్థానిక సమీకరణాలు-బీసీ ప్రాధాన్యత దృష్ట్యా అన్నా అనిత అభ్యర్థిత్వమే మేయర్ రేసులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
తిరుపతి మేయర్ పీఠం ఎవరిది? బలిజ, యాదవ వర్గాల మధ్య తీవ్ర పోటీ..!


Leave a Reply