తిరుపతి, (రేణిగుంట): రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ్ నగర్‌లో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. సుమారు 10 వేల ఇళ్లు ఉన్న ఈ కాలనీలో దాదాపు 5 వేల కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ, తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం ద్వారా తగినంత నీటి సరఫరా అందకపోవడంతో స్థానికులు ప్రైవేట్ నీటి ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. నిత్యం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై అదనపు భారం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి కాలంలో ప్రారంభమైన నీటి కొరత ప్రస్తుతం మరింత తీవ్రమైందని, తాగునీటి కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని వారు చెబుతున్నారు. సంబంధిత అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆరోపిస్తున్నారు.
తక్షణమే అధికారులు స్పందించి తారకరామ్ నగర్‌కు క్రమబద్ధమైన తాగునీటి సరఫరా అందించడంతో పాటు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం నీటి ట్యాంకర్లే వేలాది కుటుంబాలకు దిక్కుగా మారాయని ప్రజలు వాపోతున్నారు.

Leave a comment